Pesarakattu Charu : మనం పెసరపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెసరపప్పులో పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా పెసరపప్పు శరీరానికి చలువ చేసే గుణం కలిగి ఉంటుంది. పెసరపప్పుతో మనం రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. పెసరపప్పుతో కూరలే కాకుండా మనం చారును కూడా తయారు చేసుకోవచ్చు. పెసరపప్పుతో చేసే చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా వేసవి కాలంలో తయారు చేసుకుని తింటూ ఉంటారు. వంటరాని వారు కూడా చేసుకోగలిగేంత సులువుగా పెసరపప్పుతో చారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరకట్టు చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ఒక టీ గ్లాస్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, పెద్ద నిమ్మకాయ – 1.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టీ స్పూన్స్, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 3, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, తరిగిన పచ్చిమిర్చి – 4 లేదా 5, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పెసరకట్టు చారు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పెసరపప్పును తీసుకుని శుభ్రండా కడగాలి. తరువాత అందులో మూడు టీ గ్లాసుల నీళ్లు, అల్లం తరుగు, పసుపు, ఒక టీ స్పూన్ నూనె వేసి మూత పెట్టాలి. ఈ పప్పును మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు, రెండున్నర లేదా మూడు గ్లాసుల నీళ్లు పోసి కలపాలి. ఈ చారును మరో పది నిమిషాల పాటు బాగా మరిగించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న చారును వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత దీనిలో రుచికి తగింనత నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరకట్టు చారు తయారవుతుంది. దీనిని అన్నం, ఇడ్లీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పెసరకట్టు చారును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ చారును తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.