Pesarapappu Pulusu : మనం పెసరపప్పుతో పులుసును కూడా తయారు చేస్తూ ఉంటాము. పెసరపప్పుతో చేసే పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పెసరపప్పు పులుసును తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. తరుచూ చేసే విధంగా గిన్నెలో కాకుండా ఈ పులుసును రాచిప్పలో కూడా తయారు చేసుకోవచ్చు. రాచిప్పలో పెసరపప్పు పులుసును తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. రాచిప్పలో రుచిగా పెసరపప్పు పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరపప్పు పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – అర కప్పు, సాంబార్ ఉల్లిపాయలు – 12, తరిగిన పచ్చిమిర్చి – 6, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – 400 ఎమ్ ఎల్, నిమ్మకాయలు – రెండు, తరిగిన కొత్తిమీర -అర కట్ట.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర -అర టీ స్పూన్, ఆవాలు -అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – 2 రెమ్మలు.
పెసరపప్పు పులుసు తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును బాగా వేయించాలి. తరువాత దీనిని శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత పలుకు లేకుండా పప్పును మెత్తగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత రాచిప్పలో సాంబార్ ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, నీళ్లు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పప్పు వేసి కలపాలి. తరువాత మరో పావు లీటర్ నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరిగించాలి. దీనిని మరో 6 నుండి 8 నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత నిమ్మరసం వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని పులుసులో వేసి కలపాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రాచిప్పలో పెసరపప్పు పులుసు తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.