Pidatha Kinda Pappu : పిడత కిందపప్పు.. సాయంత్రం సమయాల్లో మనకు రోడ్ల పక్కన లభించే చిరుతిళ్లల్లో ఇవి కూడా ఒకటి. పిడత కింద పప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈపిడత కింద పప్పును అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా రుచిగా ఇంట్లోనే పిడత కింద పప్పును తయారు చేసి తీసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ పిడత కిందపప్పును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పిడత కింద పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనెలో వేయించిన అటుకులు – ఒక కప్పు, వేయించిన కార్న్ ఫ్లేక్స్ – అర కప్పు, టమాట బజ్జీ – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, కారం – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నిమ్మరసం – అర చెక్క.
పిడత కింద పప్పు తయారీ విధానం..
ముందుగా గిన్నెలో అటుకులను తీసుకోవాలి. తరువాత కార్న్ ఫ్లేక్స్ ను వేసుకోవాలి. తరువాత టమాట బజ్జీని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా చేత్తో నలుపుతూ బాగా కలుపుకోవాలి. తరువాత వీటిపై ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పల్లీలు చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిడత కింద పప్పు తయారవుతుంది. ఇందులో టమాట బజ్జీకి బదులుగా టమాట ముక్కలు, మిర్చి బజ్జీ, ఉల్లిపాయ పకోడా ఇలా దేనినైనా వాడుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పిడత కింద పప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.