Pitla Chutney : మనం ఉదయం రకరకాల అల్పాహారాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే వీటిని తినడానికి వివిధ రకాల చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మహారాష్ట్ర స్పెషల్ పిట్లా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చట్నీ చూడడానికి అచ్చం బొంబాయి చట్నీలా ఉంటుంది. కానీ రుచి మాత్రం వేరుగా ఉంటుంది. ఈ పిట్లా చట్నీని చాలా తక్కువ సమయంలో, చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. పిట్లా చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పిట్లా చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 2 కప్పులు, పలుచటి చింతపండు రసం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, తరిగిన కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
పిట్లా చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత అందులో నీళ్లను, చింతపండు రసాన్ని పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. దీనిని 5 నుండి 10 నిమిషాల పాటు పెద్ద మంటపై చిక్కబడే వరకు ఉడికించాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. శనగపిండి మిశ్రమాన్ని దగ్గర పడే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే పిట్లా చట్నీ తయారవుతుంది. దీనిని ఇడ్లీ, వడ, దోశ, పూరీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన పిట్లా చట్నీని కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.