Ponnaganti Karam Podi : పిల్ల‌ల కంటి చూపున‌కు ఎంత‌గానో మేలు చేసే పొన్న‌గంటి కారం పొడి.. త‌యారీ ఇలా..!

Ponnaganti Karam Podi : అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన ఆకుకూర‌ల‌ల్లో పొన్న‌గంటి కూర కూడా ఒక‌టి. పొన్న‌గంటికూర‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు, పోష‌కాలు ఉంటాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. పొన్న‌గంటికూర‌తో ఎక్కువ‌గా ప‌ప్పు, ప‌చ్చ‌డి , వేపుడు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆకుకూర‌తో మ‌నం కారంపొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పొన్న‌గంటి కూర‌తో చేసే ఈ కారం పొడి రుచిగా ఉండ‌డంతో పాటు ఎక్కువ కాలం పాటు నిల్వ కూడా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. పొన్న‌గంటిఆకుకూర‌తో ఆరోగ్యానికి మేలు చేసేలా కారం పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పొన్న‌గంటి కూర కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పొన్న‌గంటి కూర – 2 పెద్ద క‌ట్ట‌లు, నూనె – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 8 నుండి 10, శ‌న‌గ‌ప‌ప్పు – పావుక‌ప్పు, మెంతి గింజ‌లు – 10, మిన‌ప‌ప్పు – 3 టేబుల్ స్పూన్స్, ధ‌నియాలు – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చింత‌పండు – ఒక రెమ్మ‌, నువ్వులు – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెమ్మ‌లు – 6, బెల్లం – ఒక చిన్న ముక్క‌.

Ponnaganti Karam Podi recipe in telugu best for kids eye sight
Ponnaganti Karam Podi

పొన్న‌గంటి కూర కారం పొడి త‌యారీ విధానం..

ముందుగా పొన్న‌గంటి ఆకుల‌ను వేరు చేసి శుభ్రంగా క‌డుక్కోవాలి. తరువాత వీటిని వ‌స్త్రంపై వేసి త‌డి లేకుండా పూర్తిగా ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత మ‌రికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత పొన్న‌గంటికూర ఆకులు వేసి చిన్న మంట‌పై క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌రో టీ స్పూన్ వేసి వేడి చేయాలి. త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు, మెంతి గింజ‌లు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, చింత‌పండు వేసి వేయించాలి. చివ‌ర‌గా నువ్వులు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన ఎండుమిర్చితో పాటు వేయించిన దినుసులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వేయించిన పొన్న‌గంటి ఆకు, ఉప్పు, వెల్లుల్లి రెమ్మ‌లు, బెల్లం వేసి మ‌రోసారి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొన్న‌గంటికూర కారం పొడి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts