Popcorn Karam Podi : పాప్ కార్న్.. వీటిని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువగా కాలక్షేపం కోసం వీటిని తింటూ ఉంటాము. మనకు వివిధ రుచుల్లో కూడా ఇవి లభిస్తూఉంటాయి. అలాగే పాప్ కార్న్ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందనే చెప్పవచ్చు. అయితే అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పాప్ కార్న్ తో మనం కారం పొడిని తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా.. పాప్ కార్న్ తో చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. మన ఇంట్లో పాప్ కార్న్ ఉంటే చాలు ఈ కారం పొడిని 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పాప్ కార్న్ కారం పొడి తయారీ విధానాన్ని.. ఇప్పుడు తెలుసుకుందాం.
పాప్ కార్న్ కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
సాధారణ పాప్ కార్న్ – ఒక పెద్ద కప్పు,ఎండుమిర్చి – 6, జీలకర్ర -ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – 3 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు- తగినంత.
పాప్ కార్న్ కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పాప్ కార్న్ ను వేసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే జార్ లో మిగిలిన పదార్థాలు కూడా వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న పాప్ కార్న్ పొడిని వేసి మరోసారి అంతా కలిసేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాప్ కార్న్ కారం పొడి తయారవుతుంది. దీనిని అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. వెరైటీ వంటకాలను కోరుకునే వారు ఇలా పాప్ కార్న్ తో కూడా కారం పొడిని తయారు చేసుకుని తినవచ్చు.