Pudina Karam Podi : ఎంతో రుచిక‌ర‌మైన పుదీనా కారం పొడి త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద‌లో తినాలి..

Pudina Karam Podi : మ‌నం వంట‌ల్లో పుదీనాను కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. దీనిని వంట‌ల్లో గార్నిష్ కొర‌కు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. పుదీనా చ‌క్క‌టి వాస‌న‌తో పాటు ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంది. పుదీనాలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, మెద‌డు ప‌నితీరును పెంచ‌డంలో, నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించ‌డంలో ఈ పుదీనా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. పుదీనాతో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పుదీనాతో చేసుకోద‌గిన వంటకాల్లో పుదీనా కారం పొడి కూడా ఒక‌టి. ఈ కారం పొడి తిన్నా కొద్ది తిన్నాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. మొద‌టిసారి చేసే వాళ్లు కూడా దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పుదీనా కారం పొడిని సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుదీనా – 5 క‌ట్ట‌లు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 20 లేదా త‌గిన‌న్ని, ధ‌నియాలు – ఒక క‌ప్పు, జీల‌క‌ర్ర – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 15, చింత‌పండు – రెండు రెమ్మ‌లు.

Pudina Karam Podi recipe in telugu very tasty make in this way
Pudina Karam Podi

పుదీనా కారం పొడి త‌యారీ విధానం..

ముందుగా పుదీనా ఆకుల‌ను తెంచుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వాటిని వ‌స్త్రంపై వేసి ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చిని మాడిపోకుండా చ‌క్క‌గా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే కళాయిలో ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత మ‌రికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పుదీనా ఆకుల‌ను వేసి వేయించాలి. పుదీనా వేగి ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని చ‌ల్లారే వ‌ర‌కు ఉంచాలి. ఇప్పుడు జార్ లో వేయించిన ఎండుమిర్చిని వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత అదే జార్ లో వేయించిన ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, పుదీనా, చింత‌పండు వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఉప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మిక్సీ ప‌ట్టుకుని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా కారం త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు ఉద‌యం చేసే అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌వ‌చ్చు. ఈ విధంగా పుదీనాతో కారం పొడి చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు పుదీనా వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts