Putnala Chutney : మనం అల్పాహారాలను తినడానికి టమాట చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఇలా రకరకాల చట్నీలను తయారు చస్తూ ఉంటాము. వీటితో పాటు మనం మరింత రుచిగా ఉండే పుట్నాల చట్నీని కూడా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, వడ వంటి వాటితో కలిపి ఈ చట్నీని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పుట్నాల చట్నీని తయారు చేసుకోవడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. నిమిషాల వ్యవధిలోనే ఈ చట్నీని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అల్పాహారాలలోకి ఎంతో కమ్మగా ఉండే పుట్నాల చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్నాల చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, పుట్నాల పప్పు – అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 5, జీలకర్ర – అర టీ స్పూన్, చింతపండు – కొద్దిగా, అల్లం – అర ఇంచు ముక్క, ఉప్పు – తగినంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్,ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు -3.
పట్నాల చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత జార్ లో పుట్నాల పప్పు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఉప్పును వేసుకోవాలి. తరువాత వేయించిన ఉల్లిపాయ, టమాట వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీటిని పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని చట్నీలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుట్నాల చట్నీ తయారవుతుంది. దీనిని అల్పాహారాలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.