Putnalu Bellam Sweet : ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కలిగే ఉండే ఆహారాల్లో పుట్నాల పప్పు కూడా ఒకటి. చాలా మంది వీటిని స్నాక్స్ లాగా తింటూ ఉంటారు. అలాగే వివిధ రకాల చట్నీల తయారీలో కూడా వీటిని వాడుతూ ఉంటారు. ఇవే కాకుండా పుట్నాల పప్పుతో మనం ఎంతో రుచిగా ఉండే స్వీట్ ను కూడా తయారు చేసుకోవచ్చు. పుట్నాల పప్పుతో చేసేఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే వంట చేయడం రాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పుట్నాల పప్పుతో ఈ స్వీట్ ను తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పుట్నాల స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్నాల స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు – ముప్పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు, యాలకులు – 2 లేదా 3, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు.
పుట్నాల స్వీట్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత పుట్నాల పప్పు, కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై రంగు మారే వరకు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని ఇందులోనే యాలకులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని కలుపుతూ కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ట్రేలోకి లేదా ప్లేట్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని పైన సమానంగా చేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచి ఆ తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిని మనకు కావల్సినట్టుగా గార్నిష్ చేసుకుని ఆ తరువాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుట్నాల స్వీట్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా పుట్నాలతో చాలా రుచిగా, సులభంగా స్వీట్ ను తయారు చేసి తీసుకోవచ్చు.