Ragi Burelu : మనం వంటింట్లో బెల్లాన్ని ఉపయోగించి అనేక రకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. బెల్లంతో చేసే తీపి పదార్థాలలో బూరెలు కూడా ఒకటి. బూరెల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా మనం బూరెలను తయారు చేయడానికి బియ్యం పిండిని ఉపయోగిస్తూ ఉంటాం. బియ్యం పిండికి బదులుగా మనం రాగి పిండిని ఉపయోగించి కూడా బూరెలను తయారు చేసుకోవచ్చు.
రాగి పిండితో మనం ఎక్కువగా జావ, ఉప్మా, రోటీ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా రాగి పిండితో కూడా బూరెలను చేయవచ్చు. రాగి పిండి బూరెలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. రాగి పిండితో బూరెలను తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి బూరెలు తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – ఒక కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – అర గ్లాస్.
రాగి బూరెలు తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు, వేయించిన పల్లీలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నెయ్యి వేసి కరిగిన తరువాత నువ్వులను వేసి వేయించుకోవాలి. నువ్వులు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసి కలిపి రెండు నిమిషాల పాటు వేయించి చల్లగా అయిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని అందులోనే రాగి పిండిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో బెల్లం తురుమును, నీళ్లను పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి జల్లి గంటతో బెల్లం నీటిని వడకట్టాలి. ఇలా వడకట్టిన నీటిని కొద్ది కొద్దిగా ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిలో పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న పిండిని కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి కాగిన తరువాత రాగి ముద్దను తీసుకుని అరటి ఆకు లేదా మందంగా ఉండే పాలిథీన్ కవర్ పై ఉంచి బూరెల ఆకారంలో వత్తి నూనెలో వేసుకుని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం ఎంతో రుచిగా ఉండే రాగి పిండి బూరెలు తయారవుతాయి. తరుచూ బియ్యం పిండితో చేసే బూరెలకు బదులుగా ఇలా రాగిపిండిని ఉయోగించి బూరెలను చేయడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.