Ragi Dates Malt : రాగి డేట్స్ మాల్ట్.. రాగిపిండి ఖర్జూర పండ్లు కలిపి చేసే ఈ మాల్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి బలం కలుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. బరువు తగ్గాలనుకున్న వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఈ మాల్ట్ ను తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. ఈ మాల్ట్ ను తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు శరీరానికి బలాన్ని అందించే ఈ మాల్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి డేట్స్ మాల్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – అర కప్పు, ఖర్జూర పండ్లు – 8, రాగిపిండి – అర కప్పు, నీళ్లు – పావు లీటర్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
రాగి డేట్స్ మాల్ట్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పాలను తీసుకోవాలి. తరువాత ఇందులో గింజలు లేని ఖర్జూర పండ్లు వేసి ఉడికించాలి. పాలన్నీ పోయి ఖర్జూర పండ్లు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. ఇందులో ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక రాగిపిండి వేసి కలపాలి. దీనిని చిక్కబడే వరకు ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న డేట్స్, అర కప్పు పాలు పోసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి డేట్స్ మాల్ట్ తయారవుతుంది. దీనిని గాస్ల్ లో పోసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి డేట్స్ మాల్ట్ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.