Ragi Ribbons : ప్రస్తుత కాలంలో చిరుధాన్యాలతో కూడా రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తున్నారు. మనకు సూపర్ మార్కెట్ లో, ఆన్ లైన్ లో, స్వీట్ షాపుల్లో చిరుధాన్యాలతో చేసే రకరకాల పిండి వంటకాలు లభిస్తున్నాయి. ఇలా మనకు లభించే పిండి వంటకాల్లో రాగి రిబ్బన్ పకోడా కూడా ఒకటి. రాగి పిండితో చేసే రిబ్బన్ పకోడాలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ రిబ్బన్ పకోడాలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి రిబ్బన్ పకోడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి రిబ్బన్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, శనగపిండి – పావు కప్పు, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, బటర్ – పావు కప్పు, నీళ్లు – అర కప్పు కంటే కొద్దిగా తక్కువ, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రాగి రిబ్బన్ పకోడా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యంపిండి, శనగపిండి వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు వేసి కలపాలి. ఇప్పుడు బటర్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తరువాత జంతికల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. తరువాత అందులో రిబ్బన్ పకోడా తయారు చేసుకోవడానికి అవసరమయ్యే బిళ్లను ఉంచి పిండిని ఉంచాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రిబ్బన్ పకోడాలను నూనెలో వత్తుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి రిబ్బన్ పకోడాలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.