Rajma Curry : మన శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలను అందించే వాటిల్లో రాజ్మా కూడా ఒకటి. రాజ్మాలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలనుకునే వారు రాజ్మాను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాజ్మాతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రాజ్మా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ కర్రీని తయారు చేయడం చాలా సులభం. అలాగే దేనితో తిన్నా కూడా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ రాజ్మా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజ్మా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాజ్మా – అర కప్పు, నీళ్లు – 3 కప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, జీలకర్ర – అర టీ స్పూన్, లవంగాలు – 4, యాలకులు – 2, బిర్యానీఆకు – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, టమాటాలు – 2, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రాజ్మా కర్రీ తయారీ విధానం..
ముందుగా రాజ్మాను శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. తరువాత వీటిని మరోసారి కడిగి కుక్కర్ లో వేసుకోవాలి. తరువాత నీళ్లు, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టాలి. వీటిని 6 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.
వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత టమాటాలను ఫ్యూరీ లాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఉడికించిన రాజ్మాను నీటితో సహా వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాజ్మా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పులావ్, బిర్యానీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.