Ram Charan Teja : ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా.. ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రానికి ఇంకా పేరు డిసైడ్ చేయలేదు. కానీ ఆర్‌సీ15 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమాను తీస్తున్నారు. ఇక దీనికి సర్కారోడు అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సాధారణంగా శంకర్ డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే.. ఆ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆయన సహజంగానే సమాజానికి మెసేజ్ ఇచ్చేలా చిత్రాలను తీస్తుంటారు. ఇక రామ్ చరణ్ తో తీస్తున్న సినిమా కూడా సమాజానికి చక్కని మెసేజ్ ఇచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. అవినీతి అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అలాగే భారీ యాక్షన్, ఎనర్జిటిక్ సన్నివేశాలు ఇందులో ఉంటాయని సమాచారం.
ఇక ఈ సినిమాకు గాను ప్రస్తుతం షూటింగ్‌ను రాజమండ్రి పరిసరాల్లో కొనసాగిస్తున్నారు. అదంతా ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కొంత పార్ట్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే ప్రస్తుతం ఆయన తన భార్య ఉపాసనతో కలిసి వెకేషన్‌లో ఉన్నారు. ఆయన రాగానే ముందుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో మార్చి 14వ తేదీ నుంచి పాల్గొంటారు. తరువాత ఆర్‌సీ15 షూటింగ్‌లో మళ్లీ జాయిన్ అవుతారు.
అయితే ఈ సినిమాను ఎక్కువ శాతం ఏపీలోనే చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ చేస్తేనే అక్కడ సినిమా విడుదలైనప్పుడు టిక్కెట్ల ధరలను పెంచుకునే అవకాశం కల్పించారు. అయితే ఆర్‌సీ 15 సినిమాను తెలియకుండానే ఏపీలో చాలా వరకు తెరకెక్కించారు. అందువల్ల చిత్రయూనిట్ చేసిన పనికి వారికి లక్ ఈ రూపంలో కలసి వచ్చింది. రేపు ఈ సినిమా విడుదలయ్యాక ఎలాగూ జీవో ప్రకారం ఏపీలో 20 శాతంకు పైగానే షూటింగ్ చేశారు కనుక టిక్కెట్ల రేట్లను పెంచుకోవచ్చు. దీంతో రామ్ చరణ్ కు లక్ ఈ విధంగా కలసి వచ్చిందని అంటున్నారు. ఇక ఈ మూవీలో దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపిస్తారని తెలుస్తోంది.