Rasbora Sweet : బొంబాయి రవ్వతో కేవలం ఉప్మానే కాకుండా మనం రకరకాల తీపి పదార్థాలను కూడా తయారు చేస్తాం. బొంబాయి రవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో రాస్బోరా ఒకటి. పేరు విభిన్నంగా ఉన్నా ఈ తీపి వంటకాన్ని తయారు చేయడం చాలా సలుభం. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. తక్కువ సమయంలో, సులభంగా తయారు చేసుకునే ఈ రాస్బోరా స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాస్బోరా స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, బొంబాయి రవ్వ – అర కప్పు, పాలు – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, మిల్క్ పౌడర్ – 2 టీ స్పూన్స్, వంటసోడా – చిటికెడు.
రాస్బోరా స్వీట్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత రవ్వను వేసి వేయించాలి. తరువాత ఇందులో పాలను కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి. రవ్వ ఉడికి దగ్గరపడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి చల్లారే వరకు ఉంచాలి. తరువాత దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని బాగా కలపాలి. తరువాత ఇందులో వంటసోడా, మిల్క్ పౌడర్, యాలకుల పొడి వేసి కలపాలి. రవ్వ మిశ్రమం గట్టిగా అయితే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పాలను వేసి మెత్తగా కలుపుకోవాలి.
తరువాత ఈ రవ్వ మిశ్రమాన్ని తగిన పరిమాణంలో తీసుకుని పగుళ్లు రాకుండా ఉండలుగా చుట్టుకుని కొద్దిగా వత్తాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో ముందుగా సిద్దం చేసుకున్న రవ్వ ఉండలను తగినన్ని వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తరువాత ముందుగా తయారు చేసుకున్న పంచదార మిశ్రమంలో వేసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చల్లగా కావాలనుకునే వారు వీటిని ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత తినవచ్చు. ఇలా చేయడం వల్ల రాస్బోరా స్వీట్ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా రాస్బోరా స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.