Rava Pongal : రవ్వతో సహజంగానే చాలా మంది స్వీట్లు లేదా ఉప్మా చేస్తుంటారు. కానీ దీంతో పొంగలి కూడా తయారు చేయవచ్చు. ఇది చాలా సులభంగా తయారవుతుంది. పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లో తినవచ్చు. దీన్ని అందరూ ఇష్టపడతారు. ఇక దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – అర కప్పు, పెసర పప్పు – పావు కప్పు, జీలకర్ర – అర టీస్పూన్, మిరియాల – 1 టీస్పూన్, అల్లం తురుము – 1 టీస్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, జీడిపప్పు – 15, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నీళ్లు – 2 కప్పులు.
రవ్వ పొంగలిని తయారు చేసే విధానం..
పెసర పప్పును శుభ్రంగా కడగి తగినన్ని నీళ్లు జత చేసి కుక్కర్‌లో ఉంచి ఉడికించాలి. స్టవ్ మీద బాణలి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగాక బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, మిరియాలు వేసి కొద్ది క్షణాలు వేయించాలి. అల్లం తురుము, కరివేపాకు జత చేసి మరోసారి వేయించాలి. ఒకటింపావు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లు మరిగించాలి. నీల్లు మరుగుతుండగా మంట తగ్గించి వేయించి పెట్టుకున్న రవ్వ వేస్తూ ఆపకుండా కలపాలి. రెండు మూలు నిమిషాలు బాగా కలిపాక ఉడికించి పెట్టుకున్న పెసర పప్పు జత చేసి మరోమారు కలియబెట్టి ఉడికిన తరువాత దింపేయాలి. జీడిపప్పులతో అలంకరించి కొబ్బరి చట్నీతో అందించాలి. ఇలా చేసిన రవ్వ పొంగలి ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ దీన్ని ఇష్టపడతారు.