Red Chilli Pickle : పండు మిర్చి పచ్చడిని ఇలా పెడితే.. ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటుంది..

Red Chilli Pickle : మ‌నం వివిధ ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకుని సంవ‌త్స‌ర కాలం పాటు నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఇలా నిల్వ ఉంచే ప‌చ్చ‌ళ్ల‌లో పండుమిర్చి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ ప‌చ్చ‌డి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా త‌యారు చేస్తారు. పండుమిర్చి దొరికే కాలంలో వాటితో ఇలా ప‌చ్చ‌డిని త‌యారు చేసి నిల్వ చేసుకుని సంవ‌త్స‌ర‌మంతా ఉప‌యోగించుకోవ‌చ్చు. అవి రాని వారు కూడా సుల‌భంగా త‌యారు చేసేలా ప‌క్కా కొల‌త‌ల‌తో పండుమిర్చి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Red Chilli Pickle here it is how to make it
Red Chilli Pickle

పండుమిర్చి ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పండుమిర్చి – అర‌కిలో, చింత‌పండు – 125 గ్రాములు లేదా త‌గినంత‌, ఉప్పు – 125 గ్రాములు, ప‌సుపు – ఒక టీ స్పూన్, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బ‌లు – పావు క‌ప్పు, మెంతి పిండి – ఒక టీ స్పూన్, ఆవ‌పిండి – ఒక టీ స్పూన్.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 150 గ్రాములు, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ఎండుమిర్చి – 3, ఆవాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – 2 టీ స్పూన్స్, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, ఇంగువ – పావు టీ స్పూన్.

పండుమిర్చి ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా పండుమిర్చిని శుభ్రంగా క‌డిగి త‌డిలేకుండా శుభ్ర‌మైన వ‌స్త్రంతో తుడ‌వాలి. త‌రువాత వీటిని పూర్తిగా త‌డి పోయే విధంగా గాలికి ఆర‌బెట్టాలి. త‌రువాత వీటి తొడిమ‌లు తీసి ముక్క‌లుగా చేసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో గింజ‌లు, ఈన‌లు తీసేసిన చింత‌పండును తీసుకోవాలి. ఇందులోనే ఉప్పును కూడా వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ముక్క‌లుగా చేసిన పండుమిర్చిని వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ప‌సుపు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మ‌ర‌లా ఒక‌సారి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పండుమిర్చి ప‌చ్చ‌డిని గాజు సీసాలో లేదా గాజు గిన్నెలో ఉంచి ఒక రోజంతా ఊర‌బెట్టాలి.

త‌రువాత ఒక వెడ‌ల్పుగా ఉండే ఒక క‌ళాయిని తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ముందుగా ఊర‌బెట్టుకున్న ప‌చ్చ‌డిని వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత మొంతిపిండి, ఆవ‌పిండి వేసి క‌ల‌పాలి. ఈ ప‌చ్చ‌డిని మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పండుమిర్చి ప‌చ్చ‌డి త‌యారవుతుంది. దీనిని త‌డిలేని గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల దాదాపు సంవ‌త్స‌రం వ‌ర‌కు పాడ‌వ‌కుండా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పండుమిర్చి ప‌చ్చ‌డి, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ప‌చ్చ‌డిని త‌యారు చేసిన‌ప్పుడు దానిని ఊర‌బెట్టి మ‌న‌కు కావ‌ల్సిన‌ప్పుడు తాళింపు వేసుకోవ‌చ్చు. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి రుచిని ఆస్వాదించవచ్చు.

D

Recent Posts