Red Sauce Pasta : రెడ్ సాస్ పాస్తా.. పాస్తాతో చేసుకోదగిన వెరైటీలలో ఇది కూడా ఒకటి. ఇటాలియన్ వంటకమైన ఈ రెడ్ సాస్ పాస్తా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి, లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ పాస్తా. ఈ రెడ్ సాస్ పాస్తాను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ ఇటాలియన్ వంటకమైనా రెడ్ సాస్ పాస్తాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ సాస్ పాస్తా తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 5, పాస్తా – ఒక కప్పు, ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్స్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు – 3, ఉల్లిపాయ తరుగు – 2 టీ స్పూన్స్, క్యారెట్ క్యూబ్స్ – 3 టేబుల్ స్పూన్స్, క్యాప్సికం క్యూబ్స్ – అర కప్పు, ఉడికించిన బఠాణీ – పావు కప్పు, మిరియాల పొడి – అర టీ స్పూన్, మిక్డ్స్ హెర్బ్స్ – ఒక టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ప్రాసెస్డ్ చీజ్ -పావు కప్పు, ప్రెష్ క్రీమ్ – 2 టీ స్పూన్స్.
రెడ్ సాస్ పాస్తా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత టమాటాలకు ఉన్న తొడిమెలను తీసేసి వాటికి గాట్లు పెట్టి నీటిలో వేసి ఉడికించాలి. టమాటాలు ఉడికిన తరువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి అందులో నుండి రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన 3 టమాటాలను జార్ లో వేసి అందులో అర కప్పు నీటిని పోసి ఫ్యూరీలాగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత పాస్తాను కూడా నీటిలో వేసి ఉడికించి వడకట్టి గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత కళాయిలో ఆలివ్ ఆయిల్, బటర్ వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. తరువాత క్యారెట్ క్యూబ్స్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత క్యాప్సికం వేసి మరో నిమిషం పాటు వేయించాలి.
తరువాత బఠాణీ వేసి కలపాలి. తరువాత టమాట ఫ్యూరీ, టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత మిరియాల పొడి, మిక్డ్స్ హెర్బ్స్, చిల్లీ ప్లేక్స్, ఉప్పు వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత పాస్తా వేసి కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు ఉడికించిన తరువాత చీజ్, ఫ్రెష్ క్రీమ్ వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని సర్వ్ చేసేటప్పుడు పైన మరికొద్దిగా చీజ్ తురుము వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రెడ్ సాస్ పాస్తా తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.