Restaurant Style Boneless Chicken Curry : చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే రెస్టారెంట్ లలో కూడా మనకు వివిధ రకాల చికెన్ వంటకాలు లభిస్తూ ఉంటాయి. రెస్టారెంట్ లలో ఎక్కువగా లభించే చికెన్ వెరైటీలలో బోన్ లెస్ చికెన్ మసాలా కర్రీ కూడా ఒకటి. చికెన్ తో చేసే ఈ మసాలా కర్రీని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చికెన్ తో చేసే ఈ మసాలా కర్రీని అచ్చం అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బోన్ లెస్ చికెన్ మసాలా కర్రీని ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్టారెంట్ స్టైల్ బోన్ లెస్ చికెన్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – అర కిలో, తరిగిన టమాటాలు – 3, జీడిపప్పు – 15, పచ్చిమిర్చి – 3, నూనె – 1/3 కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, యాలకులు – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ – ఒక టీ స్పూన్, నీళ్లు – అర కప్పు, బటర్ – ఒక టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
రెస్టారెంట్ స్టైల్ బోన్ లెస్ చికెన్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో టమాట ముక్కలను, జీడిపప్పును, పచ్చిమిర్చిని వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత చికెన్ ను వేసి పెద్ద మంటపై 15 నిమిషాల పాటు బాగా వేయించాలి. తరువాత నీళ్లు, బటర్, క్రీమ్, కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు 10 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను వేసి మధ్యస్థ మంటపై మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నీళ్లు పోసి మరో 8 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివరగా బటర్, క్రీమ్, కొత్తిమీరను చల్లి ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బోన్ లెస్ చికెన్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, రోటి, పుల్కా, నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ కు వెళ్లే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండే చికెన్ మసాలా కర్రీని తయారు చేసుకుని తినవచ్చు. ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా ఈ చికెన్ కర్రీని అందరూ ఇష్టంగా తింటారు.