Restaurant Style Curd Rice : మనకు రెస్టారెంట్ లలో లభించే పదార్థాల్లో కర్డ్ రైస్ కూడా ఒకటి. కర్డ్ రైస్ అనగానే చాలా మంది అన్నంలో పెరుగు వేసి కలపడం అని అనుకుంటారు. కానీ రెస్టారెంట్ లలో లభించే కర్డ్ రైస్ చాలా మెత్తగా, క్రీమ్ లాగా ఉంటుంది. ఎంత తిన్నా తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ కర్డ్ రైస్ ను అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. లంచ్ బాక్స్ లోకి, డిన్నర్ లోకి ఈ రైస్ చాలా చక్కగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బియ్యం – అర కప్పు, నీళ్లు – లీటర్, పాలు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, అల్లం తరుగు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తియ్యటి పెరుగు – అర లీటర్, క్రీమ్ – పావు కప్పు.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, జీడిపప్పు – 15.
రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యం, నీళ్లు , పాలు పోసి కలపాలి. తరువాత దీనిని మధ్యస్థ మంటపై బియ్యం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అన్నం మెత్తగా అయిన తరువాత గంటెతో మరింత మెత్తగా చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఉప్పు వేసి కలపాలి. దీనిని నీరంతా పోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. తరువాత ఉడికించిన అన్నాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో పెరుగు, క్రీమ్ వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని నూనెంత పోయే వరకు వడకట్టాలి. తరువాత ఈ తాళింపులో సగం తాళింపు అన్నంలో వేసి కలపాలి. తరువాత ఈ రైస్ ను ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత మిగిలిన తాళింపును పైన వేసుకుని అలాగే దానిమ్మ గింజలను, క్యారెట్ తురుమును చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కర్డ్ రైస్ తయారవుతుంది. దీనిని ఒక్క స్పూన్ కూడా వదిలిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.