Rice Flour And Wheat Flour Snacks : మనం బియ్యంపిండితో రకరకాల స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. బియ్యం పిండితో చేసే స్నాక్స్ చాలా రుచిగా, క్రిస్పీగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. బియ్యంపిండితో తరుచూ చేసే స్నాక్స్ తో పాటు కింద చెప్పిన విధంగా చేసే స్నాక్స్ కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు లేదా నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ స్నాక్స్ చాలా సులభంగా, ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. వీటిని కూడా అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. బియ్యపిండితో రుచిగా, అందరికి నచ్చేలా తక్కువ సమయంలో రుచికరమైన స్నాక్స్ ను ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి- ఒక కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – కొద్దిగా, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ముందుగా గిన్నెలో బియ్యంపిండి, గోధుమపిండి వేసి కలపాలి. తరువాత వంటసోడా, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పునుగుల పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత వంటసోడా వేసి కలపాలి. ఈ విధంగా పిండిని సిద్దం చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని పునుగుల్లాగా లేదా ప్లాటర్స్ లాగా మనకు నచ్చిన ఆకారంలో వేసుకోవాలి. ఇలా నూనెకు తగినన్ని వేసుకున్న తరువాత వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్నాక్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో, చట్నీతో లేదా కారం పొడితో దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన స్నాక్స్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.