Rice Vada : రైస్ వడలు.. బియ్యంపిండితో చేసే ఈ వడలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి పిండిని నానబెట్టే అవసరమే లేదు. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తయారు చేసుకుని తినవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వడలను తయారు చేసుకుని వేడి వేడిగా తింటూ ఎంజాయ్ చేయవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే రైస్ వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్ వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యంపిండి – ఒక కప్పు, గోధుమపిండి – 2 టీ స్పూన్స్, బొంబాయి రవ్వ – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రైస్ వడ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత గోధుమపిండి, రవ్వ వేసి కలపాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలపాలి. తరువాత 2 టీ స్పూన్ల నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు పాలిథిన్ కవర్ లేదా అరటిఆకు తీసుకుని నూనె రాసుకోవాలి. తరువాత పిండిని తీసుకుని వడలాగా వత్తుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ లేదా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే బియ్యం పిండితో రుచికరమైన వడలను తయారు చేసుకుని వేడి వేడిగా తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.