Royyala Masala Kura : రొయ్య‌ల మ‌సాలా కూర‌.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటుంది..!

Royyala Masala Kura : మ‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్ప‌త్తుల‌లో రొయ్య‌లు కూడా ఒక‌టి. రొయ్య‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అతి ముఖ్య‌మైన పోషకాలు రొయ్య‌ల‌లో ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా క‌లిగిన ఆహారాల్లో రొయ్య‌లు ఒక‌టి. బ‌రువు తగ్గ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో రొయ్య‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రొయ్య‌ల‌లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. క‌నుక కండ పుష్టి కోసం వ్యాయామాలు చేసే వారు రొయ్య‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Royyala Masala Kura very tasty make in this method
Royyala Masala Kura

జుట్టును, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా రొయ్య‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రొయ్య‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల బీపీ, షుగ‌ర్, గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఇత‌ర మాంసాహార ఉత్ప‌త్తుల కంటే రొయ్య‌లు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. అరుగుద‌ల శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు వీటిని తిన‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఇక స‌రిగ్గా చేయాలే కానీ రొయ్య‌ల కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా సులువుగా, రుచిగా రొయ్య‌ల కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రొయ్య‌ల మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రొయ్య‌లు – అర కిలో, ప‌సుపు – ఒక‌ టీ స్పూన్, ఉప్పు – రుచికి త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – ఒక‌టి, దాల్చిన చెక్క – 1, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం – రెండున్న‌ర టీ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక క‌ప్పు, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్.

రొయ్య‌ల మ‌సాలా కూర త‌యారీ విధానం..

ముందుగా రొయ్య‌ల‌లో అర టీ స్పూన్ ప‌సుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి క‌లిపి 10 నిమిషాల పాటు ప‌క్క‌న‌ ఉంచాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత బిర్యానీ ఆకు, చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, జీల‌క‌ర్ర వేసి వేయించుకోవాలి. త‌రువాత త‌రిగిన ఉల్లిపాయ‌లు, ప‌చ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, క‌రివేపాకు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ప‌సుపు, ఉప్పు వేసి క‌లిపి పెట్టుకున్న రొయ్య‌ల‌తోపాటు మ‌రి కొద్దిగా ప‌సుపు, కారం వేసి క‌లిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉంచాలి. 3 నిమిషాల త‌రువాత త‌రిగిన ట‌మాట‌ల‌ను, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి రుచికి స‌రిప‌డా మ‌రి కొద్దిగా ఉప్పును వేసి క‌లిపి మూత పెట్టి మ‌రో 2 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత ఒక క‌ప్పు నీళ్ల‌ను క‌లిపి మూత పెట్టి రొయ్య‌లు పూర్తిగా ఉడికేలా 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రొయ్య‌లు పూర్తిగా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి మ‌రికొద్దిగా త‌రిగిన కొత్తిమీర‌ను వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్య‌ల మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా, రాగి సంగ‌టి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రొయ్య‌ల‌ కూరను చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డ‌మే కాకుండా రొయ్య‌ల‌లో ఉండే పోష‌కాలు శ‌రీరానికి ల‌భిస్తాయి.

Share
D

Recent Posts