Rumali Roti Recipe : రెస్టారెంట్ లలో లభించే ఆహార పదార్థాల్లో రుమాలి రోటీలు కూడా ఒకటి. ఈ రోటీలు చాలా పలుచగా ఉంటాయి. వీటిని మసాలా కూరలతో కలిపి ఎక్కువగా తింటూ ఉంటాం. రెస్టారెంట్ లలో లభించే ఈ రుమాలి రోటీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎక్కువ శ్రమ లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో రుమాలి రోటీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్టారెంట్ స్టైల్ రుమాలి రోటి తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పంచదార – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – తగినన్ని.
రెస్టారెంట్ స్టైల్ రుమాలి రోటి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి అందులో తగినంత ఉప్పు, పంచదార వేసి కరిగే వరకు కలపాలి. ఈ నీటిని పిండిలో పోసి బాగా కలపాలి. తరువాత నూనె వేసి మరలా 5 నుండి 6 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తరువాత మరలా ఒక టీ స్పూన్ వేసి బాగా కలపాలి. ఇలా 8 నుండి 10 నిమిషాల వరకు బాగా కలపాలి. పిండి చపాతీ పిండి కంటే కూడా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మనం ఎంత ఎక్కువ సేపు కలిపితే రోటీలు అంత మృదువుగా వస్తాయి. తరువాత పిండిని తగిన మోతాదులో తీసుకుని ముద్దలుగా చేసుకోవాలి. ఒక ప్లేట్ మీద పొడి పిండి చల్లి పిండి ముద్దలను అందులో ఉంచాలి. వాటిపై కొద్దిగా నూనె రాసి తడి వస్త్రాన్ని కప్పి 30 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. ఇప్పుడు ఒక ఇనుప కళాయిని స్టవ్ మీద బోర్లించి పెద్ద మంటపై వేడి చేయాలి.
కళాయి వేడిగా అయిన తరువాత ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన ఉప్పును తీసుకుని అర కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాత ఈ నీటిని వేడి వేడి కళాయి మీద చల్లాలి. ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ ఒక్కో ముద్దను తీసుకుంటూ వీలైనంత పలుచగా వత్తుకోవాలి. తరువాత దీనిని చేత్తుల్లోకి తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ రుమాలీ రోటీలా చేసుకోవాలి. తరువాత దీనిని కళాయి మీద వేసి 30 సెకన్ల పాటు అలాగే ఉంచాలి. తరువాత రోటిని అటూ ఇటూ తిప్పుతూ చక్కగా కాల్చుకుని మడత పెట్టి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేతుల మీద చేయడం రాని వారు చపాతీ కర్రతో వీలైనంత పలుచగా వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్ రుమాలీ రోటీలు తయారవుతాయి. మసాలా కూరలతో కలిపి తింటే ఈ రుమాలి రోటీలు రుచిగా ఉంటాయి. అయితే ఈ రోటీలను వేడి తింటేనే మెత్తగా ఉంటాయి.