Russian Salad : రష్యన్ సలాడ్.. రష్యన్ స్టైల్ లో చేసే ఈ సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. ఈ సలాడ్ ను చల్ల చల్లగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ సలాడ్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. సలాడ్ అంటే ఇష్టంలేని వారు కూడా ఈ సలాడ్ ను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ రష్యన్ సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రష్యన్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యూబ్స్ లాగా తరిగిన బంగాళాదుంప – పెద్దది ఒకటి, క్యూబ్స్ లాగా తరిగిన క్యారెట్ – పెద్దది ఒకటి, తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – 6, ఉడికించిన బఠాణీ – అర కప్పు, పైనాఫిల్ క్యూబ్స్ – ముప్పావు కప్పు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, మయనీస్ – ముప్పావు కప్పు, ఫ్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్.
రష్యన్ సలాడ్ తయారీ విధానం..
ముందుగా మరుగుతున్న నీటిలో బంగాళాదుంప ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే నీటిలో క్యారెట్ ముక్కలను కూడా వేసి ఉడికించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ ముక్కలు మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బఠాణీ, పైనాఫిల్ ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి, మయనీస్, ప్రెష్ క్రీమ్ వేసి కలపాలి. ఈ సలాడ్ ను అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రష్యన్ సలాడ్ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన సలాడ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.