Sabja Seeds Badam Drink : ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి చాలా మంది శీతల పానీయాలను తాగుతూ ఉంటారు. ఇవి చల్లగా ఉన్నప్పటికి వీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. శీతల పానీయాలకు బదులుగా మన ఇంట్లోనే చాలా సులభంగా ఒక డ్రింక్ ను తయారు చేసుకుని తాగవచ్చు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనం కలగడంతో పాటు శరీరానికి కడా చలువ చేస్తుంది. నీరసం కలగకుండా ఉంటుంది. ఈ డ్రింక్ ను తయారు చేయడం చాలా సులభం. రుచిగా, కమ్మగా, చల్ల చల్లగా సమ్మర్ స్పెషల్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్ స్పెషల్ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – అర లీటర్, నానబెట్టిన బాదంపప్పు – 20, కస్టర్డ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – పావు కప్పు, పంచదార – 4 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, నానబెట్టిన సబ్జా గింజలు – ఒక టేబుల్ స్పూన్.
సమ్మర్ స్పెషల్ డ్రింక్ తయారీ విధానం..
ముందుగా బాదంపప్పు ఉండే పొట్టును తీసేసి వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు, కస్టర్డ్ పౌడర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో పాలు వేసి వేడి చేయాలి. పాలు వేడయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం మిశ్రమం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత పంచదార, డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు నుండి నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత ఇందులో సబ్జా గింజలను వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో పోసి రెండు గంటల పాటు ఉంచాలి.
రెండు గంటల తరువాత దీనిని మరోసారి కలుపుకుని గ్లాస్ లో పోసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సమ్మర్ స్పెషల్ డ్రింక్ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ విధంగా ఇంట్లోనే కమ్మని డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల ఎండ వల్ల కలిగే నీరసం నుండి బయటపడవచ్చు.