Saggubiyyam Paratha : సగ్గు బియ్యంతో చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. ఇవి మన శరీరానికి చలువ చేస్తాయి. వేసవితో సగ్గుబియ్యం జావను తయారు చేసి తాగుతుంటారు. దీంతో వేసవి తాపం తగ్గుతుంది. అయితే సగ్గు బియ్యాన్ని కేవలం వేసవిలోనే కాదు.. మనం ఏ సీజన్‌లో అయినా సరే తీసుకోవచ్చు. వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇక సగ్గు బియ్యంతో జావ మాత్రమే కాకుండా మనం పరాటాలను కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా సులభమే. సగ్గు బియ్యం పరాటాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గు బియ్యం పరాటాల తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గు బియ్యం – ఒక కప్పు, పల్లీలు – అర కప్పు, నీళ్లు – ఒక కప్పు, పచ్చి మిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉడికించిన ఆలుగడ్డలు – 2, కొత్తిమీర – 1 టీస్పూన్, జీలకర్ర – 1 టీస్పూన్, ఎండు మిర్చి – 2, ఉప్పు – తగినంత, నూనె, నెయ్యి – తగినంత.

సగ్గు బియ్యం పరాటాలను తయారు చేసే విధానం..
ఒక పాత్రలో సగ్గు బియ్యం వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి నీరు వంపేయాలి. స్టవ్ మీద బాణలిలో పల్లీలు వేసి బాగా వేయించి చల్లార్చాలి. మిక్సీ జార్‌లో పల్లీలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి వేసి బరకగా మిక్సీ పట్టి సగ్గు బియ్యానికి జత చేయాలి. ఉడికించిన బంగాళా దుంపలను తురుముతూ జత చేయాలి. కొత్తిమీర, జీలకర్ర, ఎండు మిర్చి లేదా మిరప కారం, ఉప్పు జత చేసి బాగా కలపాలి. పాలిథీన్ కవర్ మీద కానీ, బటర్ పేపర్ మీద కానీ కొద్దిగా నూనె రాయాలి. తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని గుండ్రంగా రొట్టెలా ఒత్తాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి తయారు చేసి ఉంచుకున్న పరాటాలను వేసి నాలుగు నిమిషాల పాటు మీడియం మంటపై కాలాక, రెండో వైపు తిప్పి అటు వైపు కూడా మూడు, నాలుగు నిమిషాలు కాల్చాక ప్లేట్‌లోకి తీసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన సగ్గు బియ్యం పరాటాలు రెడీ అవుతాయి. వీటిని పెరుగు చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.