Samantha : స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆమె తరచూ తాను చేసే పనులకు చెందిన విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంటుంది. ఇక తన వ్యక్తిగత విషయాలతోపాటు ఆమె సమాజంలో జరుగుతున్న సంఘటనలు, ఉన్న పరిస్థితులపై కూడా స్పందిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా జరుగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై కూడా స్పందించింది. ఉక్రెయిన్ పై రష్యా పాల్పడుతున్న మారణకాండను అందరూ ఖండిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రష్యాపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది సెలబ్రిటీలు ఇప్పటికే ఈ విషయంపై స్పందించారు. దీంతో సమంత కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఉక్రెయిన్‌లోని ఓ హాస్పిటల్ ఐసీయూ నుంచి పసికందులను బాంబ్ షెల్టర్‌లోకి తరలిస్తున్న ఓ వీడియోను సమంత షేర్ చేసింది. అప్పుడే పుట్టిన ఆ పసికందులకు ఎన్ని కష్టాలు వచ్చాయో కదా పాపం.. అంటూ సమంత కామెంట్ పెట్టింది. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడికి చెందిన ఓ వార్తా కథనాన్ని కూడా ఆమె షేర్ చేసింది. అందులో ఆయన ధైర్య సాహసాల గురించి వివరించారు. ఈ క్రమంలోనే సమంత కూడా ఆయన తెగువను మెచ్చుకుంటూ ఆ కథనాన్ని షేర్ చేసింది. కాగా ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. మరోవైపు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఈమె గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో శకుంతలగా ఆమె ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. అలాగే యశోద అనే మరో మూవీతోపాటు కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలోనూ సమంత నటించింది. ఈ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ మధ్యే సమంత నల్గొండలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరు కాగా.. అక్కడ ఆమెను చూసేందుకు భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చారు.