Sattu Sharbat : వేసవి కాలంలో వేడి నుంచి ఉపశమనాన్ని పొందేందుకు చాలా మంది అనేక రకాల పానీయాలను తాగుతుంటారు. కొందరు కూల్ డ్రింక్స్‌ను ఆశ్రయిస్తే కొందరు పళ్ల రసాలను, ఇంకొందరు కొబ్బరి బొండాలను తాగుతారు. ఇంకా కొందరు లస్సీ, ఫలూదా వంటి వాటిని తీసుకుంటారు. అయితే చాలా మంది తాగే పానీయాల్లో షర్బత్ ఒకటి. మనం రెగ్యులర్‌గా చేసుకునే షర్బత్‌కు బదులుగా ఇలా వెరైటీగా ఒక్కసారి చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. ఈ షర్బత్‌ను ఎలా చేయాలి, అందుకు ఏమేం కావాలి, అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సత్తు షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగ పిండి – 3 టేబుల్ స్పూన్లు, నీళ్లు – 1 లీటర్ (చల్లనివి), నిమ్మకాయ – 1, పుదీనా ఆకులు – 8 (సన్నగా తరగాలి), నల్ల ఉప్పు – ముప్పావు టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి – అర టీస్పూన్, మిరియాల పొడి – చిటికెడు, ఉప్పు – పావు టీస్పూన్.
సత్తు షర్బత్‌ను తయారు చేసే విధానం..
మూడింట ఒక వంతు కప్పు వేయించిన శనగలను మెత్తని పొడిలా పట్టుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పొడిని సైతం వాడుకోవచ్చు. తరువాత ఒక పాత్ర తీసుకుని అందులో శనగ పిండి, నీళ్లు వేసి బాగా కలపాలి. అందులోనే నిమ్మరసం పిండాలి, దాంట్లోనే తరిగిన పుదీనా ఆకులు, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం తయారైన షర్బత్‌ను గ్లాస్‌లలో పోసుకోవాలి. దీంతో చల్ల చల్లని సత్తు షర్బత్ రెడీ అవుతుంది. ఇందులో అవసరం అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.
ఇదే షర్బత్ తయారీలో శనగపిండికి బదులుగా బార్లీ పిండిని కూడా ఉపయోగించవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలు, పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. అల్లం రసం, చాట్ మసాలా, జల్‌జీరా మసాలా పొడి, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా వేస్తే షర్బత్ మరింత అద్బుతమైన రుచితో తయారవుతుంది. దీన్ని అందరూ ఇష్టంగా తాగుతారు.