Semiya Curd Bath : సేమియా కర్డ్ బాత్.. సేమియాతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. సేమియా, పెరుగు కలిపి చేసేఈ బాత్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, డిన్నర్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని 10 నిమిషాల్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, అల్పాహారం తయారు చేసుకోవడానికి సమయం తక్కువగా ఇలా అప్పటికప్పుడు సేమియాతో కర్డ్ బాత్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. చాలా సమయంతో రుచిగా చేసుకోగలిగిన ఈ సేమియా కర్డ్ బాత్ ను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా కర్డ్ బాత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమియా – 120 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, చిలికినపెరుగు – 250 ఎమ్ ఎల్, కీరదోస తరుగు – పావు కప్పు, మిరియాల పొడి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, దానిమ్మ గింజలు – కొన్ని.
సేమియా కర్డ్ బాత్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత సేమియా వేసి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిపై చల్లటి నీటిని పోసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీడిపప్పును వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి , కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి.
ఇప్పుడు గిన్నెలో పెరుగును తీసుకుని చిలకాలి. తరువాత అందులో నీళ్లు పోసి మజ్జిగలా చేసుకోవాలి. తరువాత ఇందులో కీరదోస తరుగు, ఉడికించిన సేమ్యా వేసి కలపాలి. తరువాత వేయించిన జీడిపప్పు, తాళింపు వేసి కలపాలి. తరువాత మిరియాల పొడి, కొత్తిమీర, దానిమ్మ గింజలు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా కర్డ్ బాత్ తయారవుతుంది. సేమియాతో తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.