Set Dosa : మనం ఉదయం అల్పాహారంగా దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలను చాలా మంది ఇష్టంగా తింటారు. మనం మన అభిరుచికి తగినట్టు రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనం రుచిగా, సులభంగా తయారు చేసుకోగలిగే వాటిల్లో సెట్ దోశ కూడా ఒకటి. సెట్ దోశ చాలా రుచిగా, చాలా మెత్తగా ఉంటుంది. ఈ సెట్ దోశను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తిన్నాలనిపించేంత రుచిగా ఉండే ఈ సెట్ దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సెట్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – ఒక కప్పు, బియ్యం – రెండు కప్పులు, మెంతులు – అర టీ స్పూన్, అటుకులు – అర కప్పు, ఉప్పు – తగినంత.
సెట్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, బియ్యం, మెంతులను తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 నుండి 7 గంటల పాటు నానబెట్టాలి. పిండి పట్టుకోవడానికి అర గంట ముందు గిన్నెలో అటుకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పును శుభ్రంగా కడగాలి. తరువాత ఈ అటుకులను, మినపప్పు, బియ్యాన్ని జార్ లో వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి రాత్రంతా పులియబెట్టుకోవాలి. పిండి బాగా పులిసిన తరువాత దీనిలో ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని దోశ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక ఒకటిన్నర గంటెల పిండిని తీసుకుని మందంగా చిన్నగా దోశలా వేసుకోవాలి.
తరువాత దీని అంచుల వెంబడి నూనె వేసి మూత పెట్టాలి. దీనిని మధ్యస్థ మంటపై 3 నుండి 4 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఈ దోశను రెండో వైపుకు తిప్పి కాల్చుకోకూడదు. ఇలా 3 నుండి 4 నిమిషాల పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సెట్ దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా అప్పుడప్పుడూ సెట్ దోశలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.