Shanaga Pindi Attu : మనం శనగపిండితో రకరకాల పిండి వంటలు, చిరుతిళ్లు తయారు చేస్తూ ఉంటాం. శనగపిండితో చేసే పిండి వంటలు చాలా రుచిగా ఉంటాయి. కేవలం పిండి వంటలు, చిరుతిళ్లే కాకుండా ఈ శనగపిండితో మనం అట్టును కూడా తయారు చేసుకోవచ్చు. శనగపిండితో చేసే అట్లు చాలా రుచిగా ఉంటాయి. వెరైటీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా శనగపిండితో అట్టును తయారు చేసుకుని తినవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఎంతో రుచిగా ఉండే శనగపిండి అట్టును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపిండి అట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1.
శనగపిండి అట్టు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత అందులో మిగిలిన పదార్థాలన్నీ వేసుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ చిక్కగా ఉండకుండా కొద్దిగా పలుచగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దానికి నూనె రాయాలి. తరువాత తగినంత పిండిని తీసుకుని అట్టులా వేసుకోవాలి. అట్టు ఒక వైపు కాలిన తరువాత మరో వైపుకు తిప్పుకుని నూనె వేసి కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తరువాత అట్టును ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపిండి అట్లు తయారవుతాయి. వీటిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఉదయం సమయం లేనప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఇలా శనగపిండితో అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే అట్టును తయారు చేసుకుని తినవచ్చు. వీటిని కూడా అందరూ ఇష్టంగా తింటారు.