Small Onion Sambar : సాంబార్.. దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా తినడానికి సాంబార్ చక్కగా ఉంటుంది. తరచూ చేసే సాంబార్ తో మనం చిన్న ఉల్లిపాయలతో కూడా రుచికరమైన సాంబార్ ను తయారు చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ సాంబార్ రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం.అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఉల్లిపాయ సాంబార్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, ధనియాలు – ఒకటిన్నర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు – చిటికెడు, మిరియాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – 2 టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, చిన్న ఉల్లిపాయలు ( సాంబార్ ఉల్లిపాయలు) – ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్, తరిగిన టమాట – 1, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, నీళ్లు – రెండు గ్లాసులు, కారం – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఉల్లిపాయ సాంబార్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత పసుపు, టమాట ముక్కలు వేసి కలపాలి.
ఇప్పుడు దీనిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. తరువాత మెత్తగా చేసుకున్న పప్పు వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 4 నుండి 5 నిమిషాల పాటు సాంబార్ ను మరిగించాలి. సాంబార్ చక్కగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. తరువాత మరో కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఇంగువ, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాళింపును అలాగే కొత్తిమీరను కూడా సాంబార్ లో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ సాంబార్ తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.