Soft Ragi Roti : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చని మనందరనికి తెలుసు. ప్రస్తుత కాలంలో వీటి వాడకం ఎక్కువవుతుందని చెప్పవచ్చు. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. రాగులతో చేసుకోదగిన వంటకాల్లో రాగిరోటీలు ఒకటి. రాగిరోటీలు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. రుచిగా, మెత్తగా ఈ రాగి రోటీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి రోటి తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – ఒక కప్పు, నీళ్లు – ఒకటింపావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్.
రాగి రోటి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, నూనె కూడా వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత రాగిపిండిని వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిపై మూతను ఉంచి గోరు వెచ్చగా అయ్యే వరకు పక్కకు ఉంచాలి. పిండి గోరు వెచ్చగా అయిన తరువాత చేత్తో బాగా కలపాలి. తరువాత తగినంత రాగి పిండిని తీసుకుని ముద్దలా చేసుకోవాలి. మిగిలిన పిండిపై మూతను ఉంచాలి. ఇప్పుడు రాగి ముద్దపై పొడి రాగి పిండి వేసుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక రాగి రోటిని వేసి కాల్చుకోవాలి. ముందుగా తడి కాటన్ వస్త్రాన్ని తీసుకుని రోటిపై నీటిని రాయాలి. 15 సెకన్లు పాటు కాల్చుకున్న తరువాత రోటిని మరో వైపుకు తిప్పుకోవాలి.
రెండో వైపు కూడా 15 సెకన్ల పాటు కాల్చుకున్న తరువాత రోటిని మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఈ రోటిని పొడి కాటన్ వస్త్రంతో ఒత్తుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. రోటి కాలిన తరువాత దీనిని వెంటనే ప్లేట్ లోకి తీసుకోకూడదు. ఒక కాటన్ వస్త్రంలో లేదా టిష్యూ పేపర్ లో ఉంచి కొద్దిగా చల్లారిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా, మెత్తగా ఉండే రాగి రోటీలు తయారవుతాయి. వీటిని వెజ్ వంటకాలతో పాటు నాన్ వెజ్ వంటకాలతో పాటు కలిపి తినవచ్చు. ఇలా రాగిపిండితో రోటీలను తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. పిల్లలకు ఈ రోటీలు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.