Soft Ragi Roti : మనం సాధారణంగా రోటీ, చపాతీ, పరోటా వంటి వాటిని గోధుమపిండితో తయారు చేస్తూ ఉంటాము. గోధుమపిండి మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని తీసుకోవడం వల్ల కొందరిలో వేడి చేస్తుంది. చాలా మంది వేసవికాలంలో చపాతీలను తినడానికి భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు గోధుమపిండికి బదులుగా మనం రాగిపిండితో రొట్టెలను చేసుకోవచ్చు. రాగి రొట్టెలను తినడం వల్ల వేఇ చేయకుండా ఉంటుంది. అలాగే ఇవి మెత్తగా కూడా ఉంటాయి. ఈ రాగి రొట్టెలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగిపిండితో రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి రోటి తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒకటింపావు కప్పులు, ఉప్పు – తగినంత, రాగిపిండి – ఒక కప్పు.
రాగి రోటి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీళ్లు, ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత రాగిపిండి వేసి కలపాలి. దీనిని చక్కగా కలిపిన తరువాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. పిండి కొద్దిగా చల్లారిన తరువాత చేత్తో వత్తుతూ బాగా కలపాలి. తరువాత కొద్దిగా పిండిని తీసుకుని బాగా కలుపుకుని ఉండలా చేసుకోవాలి. మిగిలిన పిండిపై మూతను అలాగే ఉంచాలి. రొట్టె చేసే ప్రతిసారి తీసుకున్న పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రాగిపిండి విడిపోకుండా జిగురుగా ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న పిండి ఉండను పొడి రాగిపిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. దీనిని ఎక్కువ ఒత్తిడి ఇచ్చి వత్తకూడదు. నెమ్మదిగా వత్తుతూ చపాతీలా చేసుకోవాలి.
తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక రొట్టెను వేసుకోవాలి. దీనిపై తడి వస్త్రంతో అద్దుతూ కాల్చుకోవాలి. ఇలా 15 సెకన్ల పాటు కాల్చుకున్న తరువాత రోటిని మరో వైపుకు తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకుని వస్త్రంపై వేసుకోవాలి. దీనిని నీరు చేరి రోటీలు మెత్తబడకుండా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి రోటీలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ విధంగా వేసవి కాలంలో రాగి రొట్టెలను చేసుకుని తినడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.