Sompu Sharbath : సోంపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నోటి దుర్వాసనను తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, రక్తాన్ని శుభ్రపరచడంలో ఇలా అనేక రకాలుగా సోంపు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ సోంపుతో మనం షర్బత్ ను కూడా తయారు చేసుకోవచ్చు. వేసవికాలంలో ఈ షర్బత్ ను తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సోంపుతో చల్లచల్లగా రుచిగా షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సోంపు – ఒక కప్పు, నీళ్లు – 3 కప్పులు, పటిక బెల్లం – అరకిలో, యాలకుల గింజల పొడి – అర టీ స్పూన్, నిమ్మ ఉప్పు – చిటికెడు, నానబెట్టిన సబ్జా గింజలు – ఒక టేబుల్ స్పూన్, చల్లటి నీళ్లు – పావు లీటర్, ఐస్ క్యూబ్స్ – తగినన్ని.
సోంపు షర్బత్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సోంపును తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. తరువాత ఈ సోంపును నీటితో సహా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను వస్త్రంలో వేసి దానిలో ఉండే రసాన్ని పిండాలి. తరువాత ఈ రసాన్ని ఒక కళాయిలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పటిక బెల్లం వేసి కలుపుతూ వేడి చేయాలి. దీనిని లేత తీగ పాకం వచ్చే అనగా కనీసం 20 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత యాలకుల పొడి, నిమ్మ ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న సోంపు మిశ్రమం 2 నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఈ సోంపు లిక్విడ్ తో షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ లో 2 టేబుల్ స్పూన్ల సోంపు లిక్విడ్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో సబ్జా గింజలు, చల్లటి నీళ్లు పోసి కలపాలి. తరువాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సోంపు షర్బత్ తయారవుతుంది. అలాగే ఈ షర్బత్ ను మరో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. సోడా, నిమ్మరసం, చాట్ మసాలా వేసి కూడా ఈ షర్బత్ ను తయారు చేసుకోవచ్చు. వేసవికాలంలో ఈ విధంగా సోంపు షర్బత్ ను తయారు చేసుకుని తాగడం వల్ల వేసవి తాపం నుండి బయటపడడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.