Sorakaya Bajji : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో రకరకాల కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. సొరకాయతో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ సొరకాయతో మం తరుచూ కూరలే కాకుండా బజ్జీలను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ బజ్జీలను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ సొరకాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ బజ్జి తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ – 1( చిన్నది), శనగపిండి – ముప్పావు కప్పు, బియ్యంపిండి – 1/3 కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
సొరకాయ బజ్జి తయారీ విధానం..
ముందుగా సొరకాయపై ఉండే పొట్టును తీసేసి గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. ఈ ముక్కలను ఉప్పు నీటిలో వేసి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో శనగపిండి, బియ్యంపిండి వేసి కలపాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి ముందుగా గట్టిగా కలుపుకోవాలి. తరువాత మరికొద్దిగా నీళ్లు పోసి పిండిని గంటె జారుడుగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో డీప్ ప్రైకు సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సొరకాయ ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ బజ్జీలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.