Sorakaya Garelu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. సొరకాయతో ఎక్కువగా మనం కూరలు, పచ్చడి, పప్పు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా సొరకాయతో మనం ఎంతో రుచిగా ఉండే గారెలను కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయతో చేసే ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. సొరకాయతో రుచిగా కరకరలాడుతూ ఉండేలా గారెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ – 300 గ్రా., పచ్చిమిర్చి – 6 లేదా కారానికి తగినన్ని, బియ్యం పిండి -5 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – గుప్పెడు, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు – 2, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సొరకాయ గారెల తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర,అల్లం, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత సొరకాయ పై ఉండే పొట్టును తీసేసి సొరకాయను తురుముకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు, జీలకర్ర, బియ్యం పిండి వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక్కో ఉండను తీసుకుంటూ గారెల లాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి.
తరువాత వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ గారెలు తయారవుతాయి. వీటిని చట్నీ లేదా టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సొరకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా గారెలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ గారెలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.