Sorakaya Milk Curry : సొరకాయను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సొరకాయతో రకరకాల కూరలను, చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. సొరకాయతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే సొరకాయను తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. మలబద్దకం సమస్య తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సొరకాయతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సొరకాయ పాల కర్రీ కూడా ఒకటి. పాలు పోసి వండే ఈ సొరకాయ కూర తరచూ చేసే సొరకాయ కూర కంటే మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ సొరకాయ పాల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పాల కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన సొరకాయ – 1, తరిగిన ఉల్లిపాయ -1, తరిగిన పచ్చిమిర్చి – 6, వేడి పాలు – ఒక గ్లాస్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నూనె- 2 టేబుల్ స్పూన్స్.
సొరకాయ పాల కర్రీ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో సొరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉడికించిన సొరకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత మధ్యస్థ మంటపై ఈ సొరకాయ ముక్కలను మరో 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన రెండు నిమిషాల తరువాత పాలు పోసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పాల కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.