Sorakaya Pachadi : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయ చలువ చేసే గుణంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. సొరకాయను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సొరకాయతో కూరలతో పాటు మనం పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. సొరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. ఈ సొరకాయ పచ్చడిని మనం రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. టమాటాలు వేసి చేసే ఈ సొరకాయ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మరింత రుచిగా, కమ్మగా సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ – అరకిలో, పచ్చిమిర్చి – 15, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కొత్తిమీర – గుప్పెడు, తరిగిన టమాటాలు – 3, చింతపండు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు.
సొరకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా సొరకాయపై ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి. తరువాత సొరకాయ ముక్కలు వేసి కలపాలి. సొరకాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తబడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తాళింపు కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
తాళింపు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే సొరకాయ పచ్చడి కంటే ఈ విధంగా టమాటాలు వేసి చేసిన సొరకాయ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. దీనిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.