Sorakaya Pallila Pulusu : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా సొరకాయ మనకు సహాయపడుతుంది. సొరకాయతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సొరకాయ పల్లీల కారం పులుసు కూడా ఒకటి. ఇది చాలా పాతకాలపు వంటకమని చెప్పవచ్చు.
సొరకాయ, పల్లీలు కలిపి చేసే పులుసు కూర తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. సొరకాయను ఇష్టపడని వారు కూడా ఈ కారం పులుసును ఇష్టంగా తింటారు. అలాగే దీనిని తయారు చేయడం కూడా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ సొరకాయ పల్లీల కారం పులుసును ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పల్లీల కారం పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
అర గంటపాటు నానబెట్టిన పల్లీలు – అర కప్పు, నూనె – 3 టీ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన టమాట – పెద్దది ఒకటి, పసుపు – అర టీ స్పూన్, లేత సొరకాయ ముక్కలు – ఒక పెద్ద కప్పు, మెంతులు – పావు టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – చిటికెడు, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నీళ్లు – పావు లీటర్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
సొరకాయ పల్లీల కారం పులుసు తయారీ విధానం..
ముందుగా నానబెట్టిన పల్లీలను నీటిలో వేసి 80 శాతం ఉడికించి వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. సొరకాయ ముక్కలు మగ్గిన తరువాత మెంతులు, ధనియాల పొడి, కారం, ఉప్పు, ఇంగువ వేసి కలపాలి.
తరువాత ఉడికించిన పల్లీలు వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పల్లీల కారం పులుసు తయారవుతుంది. దీనిని అన్నం, రోటీ, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. సొరకాయతో ఈ విధంగా కారం పులుసును తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.