Sorakaya Pulusu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ ఒకటి. సొరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో వేడిని తగ్గించడంలో సొరకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సొరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పొరకాయతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. సొరకాయతో మనం పులుసు కూరను కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. సొరకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన సొరకాయ – 1 ( చిన్నది), పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, పుట్నాల పప్పు పొడి – 2 టీ స్పూన్స్, బెల్లం – ఒక చిన్న ముక్క.
తాళింపు పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1.
సొరకాయ పులుసు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలన్నీ వేసి బాగా వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, సొరకాయ ముక్కలు, కారం వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టి మధ్యస్థ మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి తగినంత చింతపండు రసం, బెల్లం ముక్క, పుట్నాల పప్పు పొడి వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొరకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పులుసును కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ వంటకాన్ని కూడా లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.