Soya Kheema Masala Curry : ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో మీల్ మేకర్ లు కూడా ఒకటి. మీల్ మేకర్ లను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాము. మీల్ మేకర్ లతో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మీల్ మేకర్ లతో మనం సులభంగా చేసుకోదగిన రుచికమైన వంటకాల్లో మీల్ మేకర్ ఖీమా మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక. దేనితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. మీల్ మేకర్ లతో తరుచూ చేసే వంటకాలతో పాటు ఇలా ఖీమా కర్రీని కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే సోయా ఖీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోయా ఖీమా మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద టమాట – 1, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, మీల్ మేకర్ – ముప్పావు కప్పు, నీళ్లు – 150 ఎమ్ ఎల్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్.
సోయా ఖీమా మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లను వేడి నీటిలో అరగంట పాటు నానబెట్టాలి. తరువాత నీటిని పిండేసి వాటిని జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని కొద్దిగా రంగు మారే వరకు వేయించిన తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న మీల్ మేకర్ వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత పుదీనా వేసి కలపాలి. తరువాత చిన్న మంటపై నీరంతా పోయి కూర దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా ఖీమా మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, బగారా అన్నం, జీరా రైస్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.