Soyabean Pappu Charu : మనలో చాలా మంది పప్పుచారును ఇష్టంగా తింటారు. పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు పప్పుచారును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పప్పుచారుతో కడుపు నిండా భోజనం చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మనం పప్పుచారును తయారు చేయడానికి కందిపప్పు, పెసరపప్పును వాడుతూ ఉంటాము. ఇవే కాకుండా మనం సోయాబీన్స్ తో కూడా పప్పుచారును తయారు చేసుకోవచ్చు. సోయాబీన్స్ తో చేసే ఈ పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పప్పును చారును తినడం వల్ల సోయాబీన్స్ లో ఉండే మేలు చేసే పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పప్పుచారును తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ సోయా బీన్స్ పప్పుచారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సోయాబీన్స్ పప్పు చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన సోయా బీన్స్ – పావుకిలో, తరిగిన టమాటాలు – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, ఉప్పు -తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు – 6, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1.
సోయా బీన్స్ పప్పుచారు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో సోయాబీన్స్, ఉల్లిపాయ ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ సోయాబీన్స్ ను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని మళ్లీ అదే కుక్కర్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో టమాట ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, చింతపండు రసం వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి.
ఇప్పుడు ఈ కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత మరో రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. తాళింపు వేగిన తరువాత దీనిని పప్పుచారులో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా బీన్స్ పప్పు చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.