Special Masala Bath : మనం రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మసాలా బాత్ కూడా ఒకటి. మసాలా బాత్ చాలా రుచిగా ఉంటుంది. రవ్వతో ఎప్పుడూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా మసాలా బాత్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఒక్కసారి ఇది తినారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మసాలా బాత్ ను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా బాత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, రవ్వ- ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, జీడిపప్పు – కొద్దిగా, అల్లం తరుగు -ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 2, పచ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన క్యారెట్ – 1, తరిగిన బీన్స్ – 3, తరిగిన టమాట – 1, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – 2 స్పూన్స్, మినపప్పు – 2 స్పూన్స్, ఎండు కొబ్బరి ముక్కలు – 2 స్పూన్స్, ఎండుమిర్చి – 3, దాల్చిన చెక్క ముక్కలు – 2, లవంగాలు – 2, యాలకులు – 2, ధనియాలు – 2 స్పూన్స్, జీలకర్ర – ఒక స్పూన్.
మసాలా బాత్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి మాడిపోకుండా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక రవ్వ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, జీడిపప్పు, అల్లం ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, బఠాణీ, క్యారెట్, బీన్స్ వేసి కలపాలి.
వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు కలపాలి. తరువాత పసుపు, 2 టేబుల్ స్పూన్ల మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా బాత్ తయారవుతుంది. ఇందులో ఇతర కూరగాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన మసాలా బాత్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.