Spicy Chicken Wings : మనకు రెస్టారెంట్ లలో, కెఎఫ్ సి వంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలల్లో లభించే వాటిలో చికెన్ వింగ్స్ కూడా ఒకటి. చికెన్ వింగ్స్ చాలా రుచిగా ఉంటాయి. స్టాటర్ గా తినడానికి, స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ చికెన్ వింగ్స్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ వింగ్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ స్పైసీ చికెన్ వింగ్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైసీ చికెన్ వింగ్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ వింగ్స్ – 300 గ్రా., పాప్రికా – ముప్పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, నల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, మైదాపిండి – పావు కప్పు, నూనె – డీప్ ప్రైకుసరిపడా.
టాసింగ్ కు కావల్సిన పదార్థాలు..
బటర్ – పావు కప్పు, హాట్ సాస్ – పావు కప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, గార్లిక్ పొడి – అర టీ స్పూన్, సోయాసాస్ – అర టీ స్పూన్, వెనిగర్ – అర టీ స్పూన్, పంచదార – అర టీ స్పూన్, పాప్రికా – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, వేయించిన నువ్వులు – ఒక టీ స్పూన్.
స్పైసీ చికెన్ వింగ్స్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో చికెన్ వింగ్స్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, పాప్రికా, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత మైదాపిండి వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. తరువాత చికెన్ వింగ్స్ వేసి మద్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. తరువాత నువ్వులు తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. వీటిని బటర్ పైకి తేలే వరకు బాగా వేయించిన తరువాత వేయించిన వింగ్స్ వేసి కలపాలి. తరువాత పెద్ద మంటపై సాసెస్ అన్నీ వింగ్స్ కు పట్టేలా టాస్ చేసుకోవాలి. చివరగా నువ్వులు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ చికెన్ వింగ్స్ తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.