Spicy Vankaya Curry : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వంకాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసుకోదగిన కూరలల్లో స్పైసీ వంకాయ కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ కూరను తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. మరింత రుచిగా, స్పైసీగా వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైసీ వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావుకిలో, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 8, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, యాలక్కాయ – 1, లవంగాలు – 2, నూనె – 2 టీ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, చిలికిన పెరుగు – 4 టీ స్పూన్స్, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
స్పైసీ వంకాయ కూర తయారీ విధానం..
ముందుగా వంకాయలను కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత ఒక జార్ లో టమాట ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయ ముక్కలను వేసి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న టమాట పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. వీటిని అర నిమిషం పాటు వేయించిన తరువాత పెరుగు వేసి కలపాలి.
దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన వంకాయ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి వంకాయ ముక్కలు ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ వంకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయ కూరను ఇష్టపడని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారనే చెప్పవచ్చు. తరచూ ఒకేరకం వంకాయ కూర కాకుండా ఇలా వెరైటీగా తయారు చేసుకుని తినవచ్చు.