Sprouts Rice : మనకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే వాటిల్లో మొలకెత్తిన గింజలు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి. బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, ప్రోటీన్ లోపాన్ని తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా మొలకెత్తిన గింజలు మనకు సహాయపడతాయి. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మనం సాధారణంగా వీటిని నేరుగా తింటూ ఉంటాము.
అలాగే కొందరు సలాడ్ గా చేసుకుని తింటూ ఉంటారు. అలాగే వీటితో మనం పులావ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. మొలకెత్తిన గింజలతో చేసే ఈ పులావ్ ను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ పులావ్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. మొలకెత్తిన గింజలతో రుచిగా , తేలికగా పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకెత్తిన గింజల పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బియ్యం – 200 గ్రా., మొలకెత్తిన గింజలు – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 3, బిర్యానీ ఆకులు – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, బిర్యానీ మసాలా -ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – రెండుంపావు కప్పులు.
మొలకెత్తిన గింజల పులావ్ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత మొలకెత్తిన గింజలను కూడా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత మొలకెత్తిన గింజలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, బిర్యానీ మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత బియ్యం వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కొద్దిగా, కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఆవిరి పోయే వరకు అలాగే ఉంచి ఆ తరువాత మూత తీసి అంతా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మొలకెత్తిన గింజల పులావ్ తయారవుతుంది. దీనిని నేరుగా తిన్నా లేదా రైతాతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మొలకెత్తిన గింజలతో పులావ్ ను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.