Street Style Chicken 65 : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసుకోదగిన వెరైటీ వంటకాల్లో చికెన్ 65 కూడా ఒకటి. చికెన్ 65 చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ తో చికెన్ 65 ని తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ చికెన్ 65ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్డు – 1, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కరివేపాకు – గుప్పెడు, తరిగిన పచ్చిమిర్చి – 4.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, మిరియాల పొడి – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క.
స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి అర గంట నుండి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత ఈ చికెన్ లో కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. తరువాత కోడిగుడ్డు తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ తెల్ల సొనను సగం వరకు చికెన్ లో వేసి కలపాలి. మసాలాలు ముక్కలకు పట్టుకున్న తరువాత కలర్ వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ ను వేసి వేయించాలి.
దీనిని మధ్యస్థ మంటపై 80 శాతం వరకు వేయించిన తరువాత చికెన్ ను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనెను మరలా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక మరలా చికెన్ ను వేసి వేయించాలి. ఇదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ 65 తయారవుతుంది. ఈ చికెన్ 65 ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసి తీసుకోవచ్చు.