Street Style Chicken Pakoda : చికెన్ తో వెరైటీ వంటకాల్లో చికెన్ పకోడీ కూడా ఒకటి. చికెన్ పకోడి చాలా రుచిగా ఉంటుంది. కరకరలాడుతూ ఉండే ఈ చికెన్ పకోడీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. నూనె పీల్చకుండా కరకరలాడుతూ ఉండే ఈ చికెన్ పకోడిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కరకరలాడుతూ ఉండేలా చికెన్ పకోడిని స్ట్రీట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడికి తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి -అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నిమ్మరసం – అర చెక్క, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – రెండు రెమ్మలు, సన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కార్న్ ఫ్లోర్ – 2 నుండి 3 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్.
స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడి తయారీ విధానం..
ముందుగా చికెన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వాటిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కలర్, ఉప్పు,ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత నూనె, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. చివరగా కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ ముక్కలకు పిండి పట్టేలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చికెన్ పై మూత పెట్టి 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక చికెన్ ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ కరకరలాడే వరకు వేయించుకోవాలి. చికెన్ క్రిస్పీగా వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడి తయారవుతుంది.